సూర్యాపేట, జూలై 15: బోర్‌వెల్ రిగ్గు పర్మిషన్ మంజూరు చేసేందుకు రూ.20 వేల లంచం తీసుకుంటూ సూర్యాపేట జిల్లా భూగర్భ జలవనరుల శాఖ అధికారి మెగావత్ బాలు ఏసీబీ అధికారులకు రెడ్‌హ్యాండెడ్‌గా చిక్కాడు. ఆయన సూచన మేరకు కార్యాలయంలోని అవుట్‌సోర్సింగ్ ఉద్యోగి కొసరాజు వెంకటేశ్వర్లు లంచం స్వీకరిస్తుండగా ఏసీబీ అధికారులు ఉచ్చుపన్ని ఇద్దరినీ అదుపులోకి తీసుకున్నారు.

బోర్‌వెల్ రిగ్గు యజమాని నుంచి లంచం డిమాండ్ చేయడంతో బాధితుడు ఈ నెల 10న ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. ఫిర్యాదును ధృవీకరించిన అనంతరం బుధవారం కార్యాలయంలో ట్రాప్ నిర్వహించిన అధికారులు రూ.20 వేల లంచం స్వీకరిస్తుండగా ఇద్దరినీ పట్టుకున్నారు.
అనంతరం మెగావత్ బాలు, కొసరాజు వెంకటేశ్వర్లపై అవినీతి నిరోధక చట్టం కింద కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. వారిని న్యాయస్థానంలో హాజరుపరచి రిమాండ్‌కు తరలించినట్లు ఏసీబీ డీఎస్పీ జగదీశ్ చందర్ తెలిపారు. కేసు దర్యాప్తు కొనసాగుతోందన్నారు.






