- బిఎల్ఏలు దొడ్డాభాస్కరరావు, స్వర్ణాల శ్రీనివాసరావుకు ఘన సత్కారం…
- ప్రతి పంచాయితీ మొద్దులగూడెంని ఆదర్శంగా తీసుకోవాలి … జిల్లా అధ్యక్షురాలు
దమ్మపేట, (సింగిడి): (SIR) ఓటరు సవరణ ప్రక్రియ సర్ లో భాగంగా అశ్వారావుపేట నియోజకవర్గంలోనే మొట్టమొదటిగా 100 శాతం డిజిటలైజేషన్ ప్రక్రియను అత్యంత వేగంగా, విజయవంతంగా పూర్తి చేసినందుకు గాను మొద్దులగూడెం105, 106 బూత్ లెవెల్ ఏజెంట్ లు దొడ్డా భాస్కరరావు, స్వర్ణాల శ్రీనివాసరావును కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షురాలు తోటా దేవి ప్రసన్న శాలువాతో ఘనంగా సత్కరించారు. నియోజకవర్గ వ్యాప్తంగా ఓటరు జాబితా నమోదు, మార్పులు, చేర్పుల సవరణ కార్యక్రమం ముమ్మరంగా సాగుతున్న తరుణంలో, సాంకేతికతను జోడించి డిజిటలైజేషన్ ప్రక్రియను వంద శాతం పూర్తి చేయడంలో దొడ్డా భాస్కరరావు, శ్రీనివాసరావు చూపిన చొరవను కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షురాలు ప్రత్యేకంగా అభినందించారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు అత్యంత కీలకమైనదని, అర్హులైన ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు కల్పించడంతో పాటు ఓటరు జాబితాలో తప్పులు లేకుండా డిజిటలైజ్ చేయడం ఎంతో బాధ్యతతో కూడుకున్న పనని పేర్కొన్నారు. డిజిటలైజేషన్ ప్రక్రియలో దొడ్డ భాస్కరరావు, స్వర్ణాల శ్రీనివాసరావు నియోజకవర్గానికే ఆదర్శంగా నిలిచారని, మిగిలిన బూత్‌ల నిర్వాహకులు, ఏజెంట్లు కూడా ఇదే స్ఫూర్తితో పనిచేసి గడువులోగా ప్రక్రియను పూర్తి చేయాలని పిలుపునిచ్చారు. సమర్థవంతంగా పనిచేసే కార్యకర్తలకు, నాయకులకు పార్టీలో ఎల్లప్పుడూ సరైన గుర్తింపు ఉంటుందని ఈ సందర్భంగా ఆమె స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, మండల పార్టీ ముఖ్య నాయకులు, నియోజకవర్గ స్థాయి ప్రతినిధులు మరియు పెద్ద సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు.






