Share this:
  • ట్యాంకర్ల ద్వారా సరిపోని సరఫరా
  • జూలై అయిపోతున్నా కూడా కనికరించని వరణుడు
  • అష్టకష్టాలు పడుతున్న నగరవాసులు

“నీరు ఉంటేనే జీవితం… నీరు లేకపోతే నగరం కూడా ఎడారే.”
ఈ మాట హైదరాబాద్ నగర శివార్లలోని బోడుప్పల్ ప్రాంత ప్రజల జీవితాలను చూస్తే అక్షర సత్యంగా అనిపిస్తుంది. ఆకాశాన్ని తాకే భవనాలు, విశాలమైన రహదారులు, ఆధునిక సౌకర్యాలతో మెరిసిపోతున్న మహానగరం ఒకవైపు కనిపిస్తుంటే, మరోవైపు ఒక బిందె నీటి కోసం గంటల తరబడి ఎదురుచూస్తున్న కుటుంబాల వేదన నగర అభివృద్ధిపై ప్రశ్నలు లేవనెత్తుతోంది.

ఒక్క ఏరియా అని కాదు.. అంతటా ఇది గోస

HMWSSB: గత రెండు నెలలుగా బోడుప్పల్, ఉప్పల్ పరిసర ప్రాంతాలు నీటి కొరతతో విలవిల్లాడుతున్నాయి. ఒకప్పుడు జీవనంతో కళకళలాడిన వీధులు, నేడు ఒక్క బిందె నీటి కోసం నిట్టూర్పులు విడిచే గృహాలుగా మారిపోయాయి. తెల్లవారకముందే నీటి కోసం ప్రారంభమయ్యే నిరీక్షణ, అర్ధరాత్రి దాటినా ముగియని ఆవేదనగా ప్రతి ఇంటి గడపను చుట్టుముడుతోంది.

తాగడానికి గుక్కెడు నీరు లేదు… స్నానం చేయడానికి చుక్క లేదు… కనీసం మరుగుదొడ్డిని ఉపయోగించుకోవడానికి కూడా బిందె నీటి కోసం కళ్లప్పగించి ఎదురుచూడాల్సిన దుస్థితి. ఇంట్లో నిండాల్సిన నీటి పాత్రలు ఖాళీగా కనిపిస్తున్న ప్రతిసారీ, ఆ కుటుంబాల గుండెల్లో ఆశలు కూడా ఎండిపోతున్నాయి. ప్రతి ఉదయం ట్యాంకర్ కోసం రోడ్డుపై నిలబడే అడుగుల వెనుక ఒక ఆవేదన ఉంది. ప్రతి ఖాళీ బిందెలో ఒక కుటుంబం నిస్సహాయత ప్రతిధ్వనిస్తోంది. ప్రతి ఎండిన నల్లా వెనుక ఒక తల్లి కన్నీటి చరిత్ర దాగి ఉంది.

HMWSSB

ఒకప్పుడు ప్రశాంత జీవనానికి నిలయమని, నగర రద్దీకి కాస్త దూరంగా సుఖంగా బతకవచ్చని భావించి వేలాది కుటుంబాలు బోడుప్పల్, ఉప్పల్ పరిసర ప్రాంతాలను తమ ఆశల నిలయంగా ఎంచుకున్నాయి. జీవితకాల పొదుపును వెచ్చించి కొందరు సొంత ఇంటి కలను నిజం చేసుకోగా, మరికొందరు ప్రశాంతమైన జీవితం కోసం అద్దె ఇళ్లలో అడుగుపెట్టారు. కానీ నేడు అదే ఇల్లు, అదే గడప, అదే కాలనీ… ఒక్క బిందె నీటి కోసం కన్నీళ్లు కార్చే వేదనకు చిరునామాగా మారింది.

ఒకవైపు బోర్లు పూర్తిగా ఎండిపోవడంతో భూగర్భ జలాలు అడుగంటిపోయాయి. మరోవైపు వాటర్ ట్యాంకర్ బుక్ చేస్తే అది ఎప్పుడు వస్తుందో చెప్పలేని పరిస్థితి. రోజులు గడుస్తున్నా ట్యాంకర్ జాడ ఉండదు. ప్రతి ఉదయం ఫోన్‌లో బుకింగ్ స్థితిని చూస్తూ, ప్రతి శబ్దానికీ “ట్యాంకర్ వచ్చిందేమో” అని గేటు వైపు పరుగెత్తే అమాయక నిరీక్షణ మాత్రమే మిగులుతోంది.

ప్రతి ఖాళీ బిందె ఒక కుటుంబం దాహాన్ని చెబుతోంది. ప్రతి ఎండిపోయిన నల్లా ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని ప్రశ్నిస్తోంది. నీటి కోసం గడిచే ప్రతి నిమిషం ప్రజల సహనాన్ని పరీక్షిస్తుంటే, ప్రతి రోజు వారి జీవితాలపై కొత్త భారాన్ని మోపుతోంది. ట్యాంకర్ వస్తుందో రాదో తెలియని అనిశ్చితి… వచ్చినా అందరికీ సరిపోతుందో లేదో అన్న ఆందోళన… ఇదే నేడు బోడుప్పల్, ఉప్పల్ ప్రజల నిత్యజీవితానికి ప్రతిబింబంగా మారింది.

ఒకప్పుడు “ఇక్కడ జీవితం ప్రశాంతంగా ఉంటుంది” అని చెప్పిన ఈ ప్రాంతం, ఇప్పుడు “ఇక్కడ నీరు దొరుకుతుందా?” అనే ఒక్క ప్రశ్నకే పరిమితమైంది. ఇల్లు కట్టుకోవడం కంటే నీటిని సమకూర్చుకోవడమే పెద్ద సవాలుగా మారిన ఈ దుస్థితి, ఒక అభివృద్ధి చెందిన మహానగరానికి తగినది కాదనే చేదు నిజాన్ని ప్రతి రోజు గుర్తు చేస్తోంది.

HMWSSB

కోట్ల ఆశలతో బతుకుతున్న ప్రజల ప్రాథమిక అవసరాలను తీర్చే పరిపాలన. కానీ నేడు బోడుప్పల్ పరిస్థితిని చూస్తే, మహానగరం అనే మాట గర్వంగా కాకుండా గాయంగా అనిపిస్తోంది. పేరుకే మహానగరం… కానీ ప్రజలు మాత్రం దాహంతో విలవిలలాడుతున్నారు. కొత్త కొత్త కాలనీలు పుట్టుకొస్తున్నాయి. జనాభా రోజురోజుకూ పెరుగుతోంది. కానీ వాటికి అనుగుణంగా మౌలిక వసతులు పెరగకపోతే, ఆ అభివృద్ధి కేవలం ప్రకటనలకే పరిమితమవుతుంది. సిమెంట్‌తో నగరాన్ని నిర్మించడం సులభమే… కానీ ప్రజల విశ్వాసాన్ని నిర్మించడం అంత సులభం కాదు. ఒక నగర గొప్పదనం భవనాల ఎత్తులో కాదు, ప్రజల జీవన ప్రమాణాల్లో ఉంటుంది. నీటి కోసం ప్రజలు బిందెలు పట్టుకుని గంటల తరబడి ఎదురుచూడాల్సి వస్తే, ఆ నగరం ఎంత పెద్దదైనా, ఎంత ఆధునికమైనదైనా, అది అసంపూర్ణ అభివృద్ధికే నిదర్శనం.

Read Now: https://singidinews.com/singidi-special-story-on-sanitation-workers/

ఎన్నికల సమయంలో ప్రతి ఇంటి గుమ్మం తట్టిన నాయకులు, “మీ సేవకులం”, “మీ సమస్యలే మా సమస్యలు” అని మాటలు ఇచ్చిన ప్రజాప్రతినిధులు, ప్రజల దాహాన్ని ఎందుకు చూడలేకపోతున్నారు? ఓటు అడిగినప్పుడు గుర్తుకొచ్చిన ఇల్లు, గెలిచిన తర్వాత ఎందుకు గుర్తుకు రావడం లేదు? ప్రజాస్వామ్యం అంటే ఎన్నికల రోజుతో ముగిసే బాధ్యత కాదు; ప్రజల అవసరాలు తీరే వరకు కొనసాగే కర్తవ్యం. ప్రజలు కోరేది సభల్లో చప్పట్లు కొట్టించే ప్రసంగాలు కాదు… వారి ఇంటి బిందె నింపే పరిష్కారం. ఈరోజు బోడుప్పల్ వీధుల్లో వినిపిస్తున్న శబ్దం పిల్లల ఆటలది కాదు… ఖాళీ బిందెల మోగుడు. ప్రతి ఇంట్లో వినిపిస్తున్న మాట “ఈరోజు నీళ్లు వచ్చాయా?” అనే ఆందోళనే. ప్రతి ఉదయం సూర్యోదయాన్ని కాకుండా ట్యాంకర్ కోసం ఎదురుచూస్తున్న కుటుంబాలు కనిపిస్తున్నాయి. చిన్నారులు చదువుకు సిద్ధమయ్యే ముందు నీటి కోసం క్యూలో నిలబడుతున్నారు. ఉద్యోగులు కార్యాలయాలకు వెళ్లే ముందు బిందెలు నింపగలమా అనే ఆలోచనతో సమయాన్ని కోల్పోతున్నారు. గృహిణుల దినచర్య అంతా ట్యాంకర్ సమయాల చుట్టూనే తిరుగుతోంది. వృద్ధులు మందులు మింగడానికి కూడా మంచినీటి కోసం ఎదురు చూస్తున్నారు. నీటి సరఫరాలో జాప్యం, ట్యాంకర్ల కొరత, ప్రత్యామ్నాయ ఏర్పాట్లలో నిర్లక్ష్యం కలిసి ప్రజల జీవితాలను అస్తవ్యస్తం చేస్తున్నాయి. నీటి కొరత వల్ల కొందరు కుటుంబాలు ప్రాంతం విడిచి వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది.

ఈ ప్రాంత ప్రజలు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. చెరువులు కాపాడితే భూగర్భ జలాలు పెరుగుతాయని విశ్వసించారు. కుంటలను పరిరక్షిస్తే రాబోయే తరాలకు నీటి కొరత ఉండదని కలలు కన్నారు. కానీ తక్కువ వర్షపాతం, పెరుగుతున్న జనాభా, ప్రణాళికల లోపం, నియంత్రణలేని నిర్మాణాలు కలిసి ఆ ఆశలన్నింటినీ ఆవిరి చేస్తున్నాయి. ప్రకృతి సహకరించకపోతే పరిపాలన మరింత చురుకుగా పనిచేయాలి. వర్షాలు తక్కువ పడితే ముందస్తు ప్రణాళికలు ఎక్కువగా ఉండాలి. సంక్షోభం వచ్చిన తర్వాత స్పందించడం కాదు, రాకముందే నివారించడం నిజమైన పాలనా దక్షత.

వర్షపు నీటి సంరక్షణను తప్పనిసరి చేయాలి

చెరువులు, కుంటలను పునరుద్ధరించాలి. భూగర్భ జలాల పునర్వ్యవస్థీకరణకు శాస్త్రీయ ప్రణాళికలు అమలు చేయాలి. పైపులైన్ లీకేజీలను అరికట్టాలి. అవసరమైనన్ని ట్యాంకర్లను అందుబాటులో ఉంచాలి. దీర్ఘకాలికంగా కొత్త నీటి వనరులను అభివృద్ధి చేయాలి. ఇవి ఇప్పుడు సలహాలు కావు; ప్రజల ప్రాణాలను కాపాడే అత్యవసర నిర్ణయాలు.

నీరు ప్రకృతి ప్రసాదమే అయినా, దానిని ప్రజలకు అందించడం ప్రభుత్వ బాధ్యత. నీరు ప్రతి పౌరుడి మౌలిక హక్కు. ఆ హక్కు కోసం ప్రజలు వేడుకోవాల్సిన పరిస్థితి రావడం అభివృద్ధి చెందిన నగరానికి గర్వకారణం కాదు; అది పరిపాలనకు గంభీర హెచ్చరిక. బోడుప్పల్ సమస్య ఒక్క ప్రాంతానిదే కాదు. ప్రణాళిక లేకుండా విస్తరిస్తున్న ప్రతి నగరానికి ఇది భవిష్యత్తు ప్రమాదాన్ని సూచించే అద్దం.

ఓ వైపు నీటి ఎద్దడి మరోవైపు వృథా తంతు

నీటి ఎద్దడితో ప్రతి ఒక్కరూ అష్టకష్టాలు పడుతుంటే మరో వైపు మాత్రం కొంత మంది కనీస ఇంగితం మరిచి ప్రవర్తిస్తున్నారు. ఇష్టం వచ్చినట్టు వృథా చేస్తున్నారు. తాజాగా జూబ్లీహిల్స్ లో ఒక ఇంట్లో నీటిని వృథా చేయడంతో జలమండలి ఆగ్రహించి ఫైన్ వేసింది. అయినా ఇటువంటి ఘటనలు తరచూ ఎక్కడో ఓ చోట జరుగుతూనే ఉన్నాయి.

HMWSSB
✍️ వ్యాసకర్త
కోట దామోదర్
మొబైల్ 9391480475

Share this: