వర్షానికి చెదిరిపోయిన రహదారి… రాకపోకలకు అడ్డంకి*
*గుంతల మయంగా మారిన … చేన్నారెడ్డి గూడ –చెగిరెడ్డి ఘనపూర్ రహదారి*
*షాద్ నగర్ ప్రజా సింగిడి ప్రతినిధి ఆగస్టు 23 రంగారెడ్డి జిల్లా*
తక్షణమే మరమ్మతులు చేపట్టాలని ఏఐఎస్ఎఫ్ జిల్లా సహాయ కార్యదర్శి ఆకాష్ నాయక్ డిమాండ్*
చౌదర్ గూడా మండలం చేన్నారెడ్డి గూడ నుంచి చెగిరెడ్డి ఘనపూర్ వెళ్లే ప్రధాన రహదారి, మరొకచోట జాకారం నుంచి గుంజలపాడు రహదారి కూడా వర్ష ప్రభావానికి తీవ్రంగా దెబ్బతింది. గడిచిన పది రోజులుగా ఈ రహదారి గుండా రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. బస్సులు ఆగిపోవడంతో విద్యార్థులు, కార్మికులు, ఉద్యోగులు, రైతులు తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
ఈ సమస్యపై విద్యార్థి సంఘాలు ఆందోళన వ్యక్తం చేశాయి. ఏఐఎస్ఎఫ్ జిల్లా సహాయ కార్యదర్శి ఆకాష్ నాయక్ మాట్లాడుతూ… విద్యార్థులు పాఠశాలలు, కళాశాలలకు వెళ్లడంలో ఇబ్బందులు పడుతున్నారు. క్షేత్రస్థాయి అధికారుల ఆదేశాల మేరకు గుంతల కారణంగా బస్సులు నిలిపి వేయబడ్డాయని స్పష్టం చేస్తున్నారు . వెంటనే రోడ్డు మరమ్మత్తులు చేపట్టకపోతే మా ఉద్యమాన్ని విస్తృత పరుస్తామని హెచ్చరించారు.
ఇక బస్ డ్రైవర్లు, కండక్టర్లు మాట్లాడుతూ… రోడ్డుపై తీవ్రస్థాయిలో గుంతలు ఏర్పడటంతో వాహనాలు నడపడం ప్రమాదకరంగా మారింది. అందుకే అధికారులు రాకపోకలు నిలిపివేయమని ఆదేశించారు. రోడ్డు సరిగా మరమ్మతులు చేస్తే మళ్లీ బస్సు సర్వీసులు ప్రారంభిస్తామని తెలిపారు.
స్థానిక ప్రజలు మాట్లాడుతూ….ప్రతిరోజూ పల్లెలో నుంచి బయటకు వెళ్లడానికి రహదారి లేక మాకు పాదయాత్ర తప్పడం లేదు. అనారోగ్య సమస్యలు వచ్చినా, అత్యవసర సమయంలోనూ ఇక్కడి నుంచి బయటికెళ్లడం కష్టతరమైందని వాపోయారు.ఈ సమస్యపై స్థానిక నేతలు కాంగ్రెస్ పార్టీ మాజీ ఎంపిటిసి గొబ్రియ నాయక్, ఘనపూర్ గ్రామ మాజీ సర్పంచ్ సాయిలు బిఆర్ఎస్ పార్టీ చింతకుంట తండా అధ్యక్షులు మాన్యా నాయక్, చందు నాయక్, స్థానిక నాయకులు,కుమార్ నాయక్ శ్రీను ప్రవీణ్ శ్రీను తదితరులు స్పందిస్తూ… రోడ్డు పరిస్థితిని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి, త్వరలోనే మరమ్మత్తులు చేపట్టి రవాణా సౌకర్యాలు సజావుగా కొనసాగేలా కృషి చేస్తామని తెలిపారు. రోడ్డు మరమ్మత్తులు వీలైనంత త్వరగా పూర్తి చేయకపోతే విద్యార్థులు, గ్రామస్తులతో ఆందోళన చేస్తామని ఏఐఎస్ఎఫ్ రంగారెడ్డి జిల్లా సహాయ కార్యదర్శి ఆకాష్ నాయక్ హెచ్చరించాడు.
Post Comment