27వ వార్డును ఎస్సీ రిజర్వేషన్‌లోనే కొనసాగించాలి
27వ వార్డును ఎస్సీ రిజర్వేషన్‌లోనే కొనసాగించాలి
కుట్రలకు పాల్పడేవారిపై చర్యలు తీసుకోవాలి అని అదనపు కలెక్టర్ ఎం నగేష్ కు వినతిపత్రం సమర్పించిన దళిత సంఘాలు..
మెదక్, ప్రజా సింగిడి స్టాపర్,జనవరి 10
మెదక్ పట్టణంలోని స్లమ్ ఏరియాగా ఉన్న 27వ వార్డు (ఎస్సీ గోల్కొండ వీధి) అత్యంత వెనుకబడిన దారిద్ర్యరేఖకు దిగువన ఉన్న ప్రాంతమని, ఎలాంటి అభివృద్ధి, ఉపాధి అవకాశాలు లేని పరిస్థితుల్లో అమాయక ఎస్సీ ప్రజలు జీవనం సాగిస్తున్నారని ఎమ్మార్పీఎస్, జగ్జీవన్ రామ్ యువజన సంఘం, ఇతర దళిత సంఘాల నాయకులు ఆందోళన వ్యక్తం చేశారు.ఈ వార్డులో సుమారు 1200 మంది జనాభా ఉండగా, అందులో మాదిగ సామాజిక వర్గానికి చెందిన ఓటర్లు సుమారు 1050 మంది ఉన్నారని తెలిపారు. మహిళలు, యువకులు జీవనోపాధి లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఈ ఎస్సీ వార్డుపై బీసీ, ఓసీ, అగ్రవర్ణాలకు చెందిన కొందరు రియల్ ఎస్టేట్ దందా వర్గాలు, రాజకీయ ప్రయోజనాల కోసం ఆధిపత్యం కొనసాగించేందుకు కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు.
ఎస్సీ వార్డుగా రిజర్వేషన్ కొనసాగాల్సిన ఈ ప్రాంతాన్ని జనరల్ రిజర్వేషన్‌గా మార్చేందుకు తమ ప్రమేయం లేకుండా కొందరు మున్సిపల్ కార్యాలయాల్లో ఎత్తుగడలు వేస్తున్నారని తెలిపారు. అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకొని ఎస్సీ ప్రజలను మోసం చేయాలని చూస్తున్నారని, ఈ కుట్రలను ముందుగానే పసిగట్టి సంబంధిత అధికారులను గుర్తించి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని మున్సిపల్ కమిషనర్‌ను కోరారు.
స్వాతంత్ర్యం వచ్చి ఇన్నేళ్లు గడిచినా రాజకీయంగా, ఆర్థికంగా, ఉపాధి పరంగా ఎలాంటి అభివృద్ధి జరగలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇకపై అగ్రకులాల ఆధిపత్యాన్ని సహించబోమని, తమ వార్డును తామే అభివృద్ధి చేసుకునే దిశగా ప్రభుత్వ, మున్సిపల్ సహకారంతో ముందుకు సాగుతామని స్పష్టం చేశారు. ప్రస్తుతం జనవరి–2026లో ప్రకటించబోయే రిజర్వేషన్లలో 27వ వార్డుకు సంబంధించి ప్రమాదం పొంచి ఉందని, వచ్చే ఫిబ్రవరిలో జరగబోయే మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో కుట్రలు మరింత పెరిగే అవకాశం ఉందని పేర్కొన్నారు. కావున 27వ వార్డును యథావిధిగా ఎస్సీ రిజర్వేషన్‌కే కేటాయించి కొనసాగించాలని అధికారులను వారు డిమాండ్ చేశారు.ఈ విషయమై మున్సిపల్ కమిషనర్‌పై ఎలాంటి ఒత్తిళ్లు తెస్తున్న వారైనా ఉంటే వారిని గుర్తించి ముందస్తు చర్యలు తీసుకోవాలని, దళిత ప్రజలకు న్యాయం చేయాలని వారు కోరారు.ఈ కార్యక్రమంలో మెదక్ పట్టణ ఆల్ పార్టీ అఖిలపక్ష నాయకులు, 27వ వార్డు కాంగ్రెస్ కార్యనిర్వాహక అభివృద్ధి స్టీరింగ్ కమిటీ సభ్యులు, ఎమ్మార్పీఎస్, జగ్జీవన్ రామ్ యువజన సంఘం, ఇతర దళిత సంఘాల నాయకులు పాల్గొన్నారు.




Post Comment