ఉగాది కానుకగా సన్నబియ్యం పంపిణీ ప్రారంభం – CM REVANTH REDDY
ఉగాది కానుకగా సన్నబియ్యం పంపిణీ ప్రారంభం – సీఎం రేవంత్ రెడ్డి
ప్రజా సింగిడి హైదరాబాద్,MARCH 30:
తెలంగాణ రాష్ట్రంలోని పేదలకు అతి పెద్ద గుడ్ న్యూస్ రేషన్ కార్డు కలిగిన వారికి సీఎం రేవంత్ రెడ్డి ఉగాది కానుక అందజేశారు. సూర్యాపేట జిల్లా హుజూర్‌నగర్‌లో మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డితో కలిసి ఆయన సన్నబియ్యం పంపిణీ పథకాన్ని ప్రారంభించారు.
ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ, “ఇప్పటివరకు శ్రీమంతులే తినే సన్నబియ్యం ఇకపై ప్రతి పేద కుటుంబానికి అందుబాటులోకి వస్తోంది. ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని, పోషక విలువలతో కూడిన సన్నబియ్యం అందించాలనే సంకల్పంతో ఈ పథకాన్ని ప్రారంభించాం” అని తెలిపారు.
సన్నబియ్యం పథకం – చరిత్రలోకి ఓ చూపు
సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ, 1957లోనే కాంగ్రెస్ రేషన్ కార్డు దుకాణాలను ప్రారంభించిందని, అనంతరం ఎన్టీఆర్ ప్రభుత్వం రూ. 2కే కిలో బియ్యం పథకాన్ని తెచ్చిందని గుర్తుచేశారు. “పేదలకు తక్కువ ధరకే బియ్యం అందించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన కృషి ఎన్టీఆర్ హయాంలో కూడా కొనసాగింది. ఇప్పుడు, తెలంగాణ ప్రజలకు మళ్లీ నాణ్యమైన బియ్యం అందించే బాధ్యతను మేము తీసుకున్నాం” అని ఆయన వివరించారు.
రేషన్ బియ్యం దుర్వినియోగంపై తీవ్ర విమర్శలు
రేషన్ బియ్యం పేరుతో కొంతమంది మఫియాలు పెద్ద ఎత్తున అక్రమ దందాలకు పాల్పడుతున్నాయని సీఎం మండిపడ్డారు. “ప్రభుత్వం ఉచితంగా బియ్యం ఇస్తుంటే, కొందరు దాన్ని రూ. 10కి అమ్ముతున్నారు. మిల్లర్లు ఈ బియ్యాన్ని రీసైక్లింగ్ చేసి, రూ. 50కి విక్రయిస్తున్నారు. పేదలకు రావాల్సిన సన్నబియ్యం, దొంగల చేతిలోకి వెళ్లడం బాధాకరం” అని పేర్కొన్నారు.
ప్రతి పేదవాడికి పోషక ఆహారం – ప్రభుత్వ లక్ష్యం
“ఇకపై తెలంగాణలో ఒక్క పేదవాడూ ఆకలితో ఉండకూడదు. అందరికీ పోషకాహారం అందించడమే మా సంకల్పం” అని సీఎం స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఆహార భద్రతా చట్టాన్ని మరింత బలపర్చేందుకు ఈ చర్య తీసుకున్నామని చెప్పారు.
బీఆర్ఎస్ పాలనపై సీఎం ప్రశ్నలు
“గత 10 ఏళ్లుగా బీఆర్ఎస్ ప్రభుత్వం సన్నబియ్యం పంపిణీపై ఎలాంటి చర్య తీసుకుందో ప్రజలు అర్థం చేసుకోవాలి. మిల్లర్ల మాఫియాను అరికట్టే దమ్ము వాళ్లకు లేకపోయింది. కానీ, మా ప్రభుత్వం మాత్రం ప్రజలకు నాణ్యమైన ఆహారం అందించేందుకు నిస్వార్థంగా కృషి చేస్తోంది” అని సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు.తెలంగాణ పేదలకు బియ్యం భద్రతను మెరుగుపర్చేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని సీఎం స్పష్టం చేశారు.




Post Comment